Nalgonda District: సమయపాలన పాటించాలన్న ప్రధానోపాధ్యాయురాలు.. భర్తతో కొట్టించిన టీచర్

  • సమయానికి రమ్మనందుకు కోపం పెంచుకున్న ఉపాధ్యాయిని
  • ఈ నెల 19న దారికాచి ఆరుగురు వ్యక్తుల దాడి
  • విచారణలో అసలు విషయం వెలుగులోకి
  • దాడి చేయించిన ఉపాధ్యాయ దంపతుల సస్పెన్షన్
Two teachers suspended after attacking a head master in guntur dist

విధుల్లో సమయపాలన పాటించాలని హెచ్చరించినందుకు ప్రధానోపాధ్యాయురాలిపై మరో ఉపాధ్యాయురాలు భర్తతో దాడిచేయించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఉపాధ్యాయురాలు రజని సమయపాలన పాటించడం లేదని, పాఠశాలకు సక్రమంగా రావడం లేదంటూ నల్గొండ జిల్లా వాడపల్లి  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పులగం రాధిక జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలిసిన రజని ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై ఫిర్యాదు చేసిన రాధికపై కసి తీర్చుకోవాలనుకున్నారు. మల్కాపట్నం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డికి విషయం చెప్పి రాధికపై దాడి చేయాలని చెప్పారు.
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాల ఉపాధ్యాయుడు దీపాల కృష్ణ ప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు రాధిక దంపతులు ఈ నెల 19న వాహనంపై వస్తుండగా మిర్యాలగూడకు చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో రామాపురం అడ్డరోడ్డు వద్ద వారిపై దాడి చేశారు.

అనంతరం వారి వద్దనున్న ఐదు సవర్ల బంగారం తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శ్రీనివాసరెడ్డి, రజనిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు నిన్న నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News