భారత్ లో ఎవరిని టార్గెట్ చేస్తారన్న జాబితాలు మా వద్ద ఉండవు: పెగాసస్ స్పైవేర్ సృష్టికర్తలు

20-07-2021 Tue 20:12
  • భారత్ లో పెగాసస్ స్పైవేర్ కలకలం
  • రెండ్రోజులుగా పార్లమెంటులో ప్రకంపనలు
  • కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్న విపక్షాలు
  • హిట్ లిస్టులు తమ పని కాదన్న ఎన్ఎస్ఓ గ్రూప్
Pegasus spyware owners explains their policy

భారత్ లో ఇప్పుడు పెగాసస్ స్పైవేర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది ఫోన్లలోకి ప్రవేశించి గుట్టుచప్పుడు కాకుండా సమాచారం ఇతరులకు చేరవేస్తుంది. కనీసం ఇది తమ ఫోన్లలో చొరబడినట్టు కూడా చాలామందికి తెలియదంటే దీని చాతుర్యం ఏపాటిదో అర్థమవుతుంది. ఒకవేళ సైబర్ నిపుణులు స్పైవేర్ ను వెతికిపట్టుకునేందుకు ఫోన్లను చెక్ చేస్తుంటే, తనంతట తానుగా ఫోన్ నుంచి నిష్క్రమించే మేధస్సు పెగాసస్ కు మాత్రమే సొంతం.

దీన్ని ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ సృష్టించింది. ప్రపంచంలోని కొన్ని దేశాల ప్రభుత్వాలకు మాత్రమే, ప్రత్యేక ప్రయోజనాల నిమిత్తం దీన్ని అందజేస్తారు. అయితే, భారత్ లోని రాజకీయ ప్రముఖులు తమపై నిఘాకు కేంద్రం పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగిస్తోందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. గత రెండ్రోజులుగా పార్లమెంటు ఉభయసభలను పెగాసస్ వ్యవహారం అట్టుడికిస్తోంది.

ఈ నేపథ్యంలో పెగాసస్ సృష్టికర్త ఎన్ఎస్ఓ గ్రూప్ స్పందించింది. భారత్ లో ఈ స్పైవేర్ సాయంతో ఎవరిని టార్గెట్ చేస్తారన్న విషయంలో తమ వద్ద ఎలాంటి జాబితాలు ఉండవని స్పష్టం చేసింది. భారత ప్రముఖులతో కూడిన టార్గెట్ లిస్టు తమ వద్ద ఉండదని, అది తమ పని కాదని చెప్పింది. గతంలోనూ తాము ఎప్పుడూ ఈ హిట్ లిస్టులను కొనసాగించలేదని వివరించింది. ఇటీవల పారిస్ కు చెందిన ఫార్బిడెన్ స్టోరీస్ అనే సంస్థ 50 వేల ఫోన్ నెంబర్ల డేటాను ప్రచురించింది. దీనిపై ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ ప్రతినిధి స్పందించారు.

"ఫార్బిడెన్ స్టోరీస్ వెల్లడించిన జాబితాలు మావి కావు. అలాంటి జాబితాలు మా వద్ద ఎప్పుడూ లేవు. అదంతా ఓ కట్టుకథ. మా నుంచి స్పైవేర్ ను కొనుగోలు చేసిన వారి హిట్ లిస్టు జాబితాలు అంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారం అది" అని కొట్టిపారేశారు. ఎక్కడైనా తమ స్పైవేర్ ను దుర్వినియోగం చేస్తున్నట్టు తమ దృష్టికి వస్తే వెంటనే నిశితంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎప్పటికీ తమ పంథా ఇదేనని ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రతినిధి ఉద్ఘాటించారు.