Maoist: అడవిలో పుట్టి పెరిగి.. మావోయిస్టు ఏరియా ప్లాటూన్ కమిటీ ఇన్‌చార్జ్‌‌గా ఎదిగిన రంజిత్ లొంగుబాటు!

  • రంజిత్ తలపై ఉన్న రూ. 4 లక్షల రివార్డు, రూ. 5 వేల తక్షణ సాయం అందజేత
  • మావోయిస్టు కేంద్రకమిటీ మాజీ సభ్యుడు రామన్న, సావిత్రి దంపతులకు అడవిలో జన్మించిన రంజిత్
  • వివరాలు వెల్లడించిన డీజీపీ మహేందర్‌రెడ్డి
Maoist Ravula Ranjit surrender at TS DGP

మావోయిస్టు పార్టీ కీలక నేత, కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు రావుల రామన్న కుమారుడు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ నిన్న డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిన రంజిత్‌పై ఉన్న రూ. 4 లక్షల రివార్డుతోపాటు తక్షణ సాయంగా మరో రూ. 5 వేలు అందించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తండ్రి రామన్న మరణం తర్వాత పార్టీలో రంజిత్ ఎన్నో అవమానాలకు గురయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవన్నారు. మావోయిస్టు భావజాలంతో సమాజానికి ఇప్పుడు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కాబట్టి మిగిలిన మావోలు కూడా లొంగిపోవాలనేది రంజిత్ అభిప్రాయమని పేర్కొన్నారు. మావోయిస్టు బెటాలియన్లలో ప్రతినెల కొత్తగా చత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందినవారు ఐదారుగురు చేరుతున్నారని, అదే సమయంలో అంతే సంఖ్యలో ఉద్యమాన్ని వీడుతున్నారని తెలిపారు.

పోలీసులకు లొంగిపోయిన రంజిత్ 1998లో రావుల రామన్న, కిష్టారం ఏరియా కమిటీ ఇన్‌చార్జ్ మడివి సావిత్రి దంపతులకు జన్మించాడు. బాల్యం మొత్తం దళాలతోనే గడిపాడు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మావోయిస్టు పార్టీ జనతా సర్కార్‌ పాఠశాలలో చదువుకున్నాడు. ఏడు నుంచి పదో తరగతి వరకు నిజామాబాద్‌లోని కాకతీయ స్కూల్‌లో రహస్యంగా విద్యనభ్యసించాడు.

తండ్రి రామన్న నేతృత్వంలో 2015 నుంచి 17 వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న రంజిత్ 2017లో ప్లాటూన్ సభ్యుడిగా వ్యవహరించాడు. 2019లో పదోన్నతిపై ఏరియా ప్లాటూన్ కమిటీ ఇన్‌చార్జ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కిష్టారం ఏరియా కమిటీ ఇన్‌చార్జ్‌గా ఉన్న తల్లి సావిత్రికి సమాచారం అందించి రంజిత్ జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు.

More Telugu News