India: భారత తొలి కరోనా పేషెంట్ కు మళ్లీ పాజిటివ్

Indias 1st Corona Patient Tests Positive For Coronavirus Again
  • చైనా వూహాన్ లో ఎంబీబీఎస్ చదువుతున్న కేరళ విద్యార్థిని
  • 2020 జనవరి 30న  ఆమెకు కరోనా నిర్ధారణ
  • అప్పట్లో మూడు వారాల చికిత్స తర్వాత కోలుకున్న బాధితురాలు
మన దేశ తొలి కరోనా పేషెంట్ గా కేరళకు చెందిన వైద్య విద్యార్థిని రికార్డు పుటల్లోకి ఎక్కారు. చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో మూడో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న ఆమె తొలి భారతీయ కరోనా పేషెంట్ గా గుర్తింపు పొందారు. 2020 జనవరి 30న ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఆమె మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆమెకు మరోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని కేరళలోని త్రిసూర్ వైద్యాధికారులు వెల్లడించారు.

న్యూస్ ఏజెన్సీ పీటీఐతో త్రిసూర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కేజే రీనా మాట్లాడుతూ, సదరు విద్యార్థిని మరోసారి కోవిడ్ బారిన పడ్డారని తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఆమెకు వచ్చింది అసింప్టొమేటిక్ అని తెలిపారు. చదువు కోసం ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ఆమెకు కోవిడ్ టెస్టులు నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం సదరు బాధితురాలు ఇంట్లో ఉన్నారని... ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

బాధిత విద్యార్థినికి తొలిసారి కరోనా నిర్ధారణ అయినప్పుడు త్రిసూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మూడు వారాల పాటు ట్రీట్మెంట్ చేశారు. వైద్య పరీక్షల్లో రెండు సార్లు నెగిటివ్ అని తేలిన తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకుందని పూర్తి స్థాయిలో నిర్ధారించుకునేందుకు ఆమెకు రెండు సార్లు టెస్ట్ చేశారు. 2020 ఫిబ్రవరి 20న ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
India
First Corona Patient
Positve
Kerala

More Telugu News