Uttar Pradesh: సమాజ్‌వాదీ పార్టీ మహిళా అభ్యర్థి చీర లాగిన ఘటన.. ఐదుగురు పోలీసులపై వేటు

  • నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మహిళ అడ్డగింత
  • నామినేషన్ పత్రాలు తీసుకుని చీర లాగిన వైనం
  • యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
yogi govt suspended 5 police men over assault on woman candidate

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళ కొంగు పట్టుకుని లాగిన ఘటనలో యూపీ ప్రభుత్వం ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా లఖింపూర్‌ ఖేరీ ప‌రిధిలో చివరి రోజైన నిన్న నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళను అడ్డుకున్న ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కుని, చీర పట్టుకుని లాగారు. అక్కడే ఉన్న కొందరు వచ్చి ఆమెను విడిపించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. యూపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార దాహంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గూండాలే ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు.

మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఓ సీఐ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు ఉన్నారు.

More Telugu News