Sri Lanka: క్రికెట్ అభిమానులకు నిరాశ... శ్రీలంక, టీమిండియా క్రికెట్ సిరీస్ వాయిదా
- లంక, భారత్ సిరీస్ పై కరోనా ప్రభావం
- ఇటీవల ఇంగ్లండ్ పర్యటన నుంచి వచ్చిన లంక జట్టు
- లంక జట్టులో ఇద్దరికి కరోనా
- జట్టు మొత్తాన్ని క్వారంటైన్ కు తరలించిన అధికారులు
ఈ నెల 13న శ్రీలంక, శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా దెబ్బకు ఈ సిరీస్ వాయిదా పడింది. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన నుంచి వచ్చిన లంక జట్టులో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలడమే అందుకు కారణం. ఆ ఇద్దరూ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా విశ్లేషకుడు నిరోషన్. వారు ఆటగాళ్లతో కలిసే ఉండడంతో, లంక జట్టు మొత్తాన్ని క్వారంటైన్ కు తరలించారు.
దాంతో, నాలుగు రోజుల్లో ప్రారంభం కావాల్సిన సిరీస్ కాస్తా, మరో 4 రోజులు వాయిదా పడింది. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. శ్రీలంకతో వన్డే సిరీస్ ను రీషెడ్యూల్ చేసినట్టు తెలిపాయి. లంకతో సిరీస్ ఈ నెల 17న ప్రారంభం అవుతుందని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం లంక క్రికెటర్లు ఓ హోటల్లో క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.