Stan Swamy: స్టాన్ స్వామి మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం

UN Human Rights wing concerns over Stan Swamy death
  • బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న స్టాన్ స్వామి
  • 2018లో అరెస్ట్
  • నిన్న గుండెపోటుతో మృతి
  • స్టాన్ స్వామి నిర్బంధంపై మానవ హక్కుల స్పందన
హక్కుల నేత, ఆదివాసీ ఉద్యమకారుడు స్టాన్ స్వామి నిన్న గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ఆయన బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ బాంబే హైకోర్టులో విచారణకు రానుండగా, కొన్ని గంటల ముందు ఆయన మరణించారు. అయితే, స్టాన్ స్వామి మృతి చెందడం పట్ల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం చీఫ్ మిచెల్లీ బాచిలెట్, అమెరికా, ఈయూ మానవ హక్కుల విభాగాల అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మతగురువుగానూ గుర్తింపు తెచ్చుకున్న ఫాదర్ స్టాన్ స్వామిని తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని వారిలో కొందరు ఆరోపించారు.

ఐరాస మానవ హక్కుల విభాగంతో పాటు ఇతర ఐరాస స్వతంత్ర పదవుల్లో ఉన్నవారు కూడా బీమా కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా మూడేళ్లుగా సానుకూల స్వరం వినిపిస్తున్నారు. వారిని నిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఐరాస మానవ హక్కుల విభాగం కార్యాలయ అధికార ప్రతినిధి లిజ్ థ్రోస్సెల్ ఇవాళ వెల్లడించారు.

కరోనా మహమ్మారి విజృంభణను దృష్టిలో ఉంచుకుని, సరైన సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలని భారత్ వంటి దేశాలను కోరుతున్నామని థ్రోస్సెల్ తెలిపారు. తమ ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్న ఏ ఒక్కరినీ నిర్బంధించరాదని ఐరాస మానవ హక్కుల విభాగం స్పష్టం చేస్తోందని వివరించారు.

84 ఏళ్ల స్టాన్ స్వామి ముంబయిలోని ఓ ఆసుపత్రిలో నిన్న మరణించారు. బీమా కోరేగావ్ కేసులో ఆయనను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. బీమా కోరేగావ్ లో హింసకు కుట్ర పన్నారని, మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని ఎన్ఐఏ ఆయనపై అభియోగాలు మోపింది. అప్పటినుంచి ఆయన ముంబయి తలోజా జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై కన్నుమూశారు.
Stan Swamy
Death
UN
Human Rights
India

More Telugu News