Mumbai: ముంబై రికార్డు... 35 రోజుల్లోనే భారీ కొవిడ్ కేంద్రం నిర్మాణం!

  • 2,170 పడకల సామర్థ్యంతో నిర్మాణం
  • 70 శాతం బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం
  • ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు 
Mumbai Builds Jumbo Covid Center in Record Time

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2,170 పడకల సామర్థ్యంగల భారీ కొవిడ్ కేంద్రం సిద్ధమైంది. కరోనా మూడవ దశను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావడంతో పాటు, మరిన్ని మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా, కేవలం 35 రోజుల్లోనే ముంబైలో ఈ ఆసుపత్రి నిర్మితం కావడం గమనార్హం. మలాడ్ సమీపంలో, జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇది నిర్మితమైంది. ఈ ఆసుపత్రి అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడంతో పాటు పర్యావరణానికి స్నేహపూర్వకమని అధికారులు తెలిపారు.

ఇక ఈ ఆసుపత్రి ప్రత్యేకతలను పరిశీలిస్తే, 70 శాతం బెడ్లకు నిరంతర ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. 384 పడకల ఐసొలేషన్ రూమ్, 42 ఐసీయూ బెడ్లు, మరో 20 డయాలసిస్ బెడ్లు ఉంటాయి. భద్రతా చర్యల నిమిత్తం 200 సీసీ కెమెరాలను కూడా ఇందులో అమర్చారు.

ముంబై డెవలప్ మెంట్ ఆధారిటీ (ఎంఎంఆర్డీయే) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఆసుపత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఉన్నతాధికారులు బీఎంసీకి అంకితం చేశారు. ఈ కేంద్రాన్ని ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఈ సందర్భంగా ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.

కాగా, కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ రాష్ట్రంలో 60 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, సుమారు 1.2 లక్షల మందికి పైగా మరణించారు. బ్లాక్ ఫంగస్ విషయంలోనూ మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇప్పటివరకూ 8,646 కేసులు నమోదు కాగా, 828 మంది మరణించారు.

More Telugu News