Andhra Pradesh: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: ఏపీ బీజేపీ
- విజయవాడలో నిన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
- రూ. 25 చీప్ లిక్కర్‌ను రూ. 300కు అమ్ముతూ పేదల రక్తం తాగుతున్నారు
- ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంపై త్వరలో ఉద్యమం
విజయవాడలో నిన్న జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అన్నారు. అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారని, తానొస్తే వాటిని భర్తీ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఉద్యోగ కేలండర్‌తో నిరుద్యోగులను వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 రూపాయల చీప్ లిక్కరును రూ. 300కు అమ్ముతూ పేదల రక్తాన్ని తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పోలవరం మట్టిని సైతం విడిచిపెట్టడం లేదని విమర్శించారు. నీటి ప్రాజెక్టుల జాప్యంపై త్వరలోనే ఉద్యమించనున్నట్టు తెలిపారు.