మహేశ్ మేనల్లుడి టైటిల్ టీజర్ రిలీజ్!

23-06-2021 Wed 17:26
  • 'హీరో'గా గల్లా అశోక్ ఎంట్రీ
  • కథానాయికగా నిధి అగర్వాల్
  • ఆకట్టుకుంటున్న టీజర్
  • శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్  
Hero Title Teaser Release

మహేశ్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తాడనే వార్త చాలాకాలంగా వినిపిస్తోంది. ఆ మధ్య ఒక సినిమా అనుకున్నా అది పట్టాలెక్కలేదు. ఆ తరువాత అశోక్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య ఒక సినిమా రూపొందించాడు. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఈ సినిమా షూటింగు జరుపుకుంది. గల్లా పద్మావతి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్  నటించింది.

తాజాగా ఈ సినిమాకి 'హీరో' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అంతేకాదు, అందుకు సంబంధించిన టీజర్ ను మహేశ్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. "అశోక్ నీ ఫస్టు సినిమా టైటిల్ ను లాంచ్ చేయడం కంటే సంతోషకరమైన విషయం మరొకటి లేదు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. 'హీరో' ప్రయాణం ప్రారంభమైంది" అంటూ ట్వీట్ చేసిన మహేశ్ బాబు, టీమ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక టీజర్ లో అశోక్ కౌబోయ్ గా కనిపిస్తున్నాడు. యాక్షన్ తో పాటు రొమాన్స్ తో కూడిన బిట్స్ పై  కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.