పార్టీపై మళ్లీ పట్టుకు శశికళ యత్నాలు.. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే రాష్ట్ర పర్యటన!

11-06-2021 Fri 09:29
  • జైలు నుంచి విడుదలయ్యాక పార్టీకి దూరంగా శశికళ
  • పార్టీ నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని వ్యాఖ్య
  • తన మద్దతుదారులతో మాట్లాడిన వీడియోలు బయటికి
  • అసంతృప్త నేతలను కలిసి ఓదార్చాలని నిర్ణయం
VK Sasikala decided to state tour

జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసినట్టు కనిపించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. అన్నాడీఎంకేపై తిరిగి పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు.  

శశికళ ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతూ.. సరైన సమయంలో రాజకీయాల్లోకి  వస్తానని, పార్టీ నుంచి తనను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు. పార్టీని కాపాడుకునేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానంటూ మాట్లాడిన వీడియో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది. ఇది నిజమనిపించేలా తాజాగా, ఆమె రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే పర్యటన చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

తాజాగా అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉళుందూరుపేట ఆనంది, పార్టీ నిర్వాహకులతో శశికళ మాట్లాడిన మరో వీడియో బయటకు వచ్చింది. ఈ ఆడియోపై స్పందించిన శశికళ మద్దతుదారులు స్పందిస్తూ.. శశికళతో సమావేశమయ్యేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారని అన్నారు. అన్నాడీఎంకేలో ఐక్యత లోపించిందని, నేతల మధ్య విభేదాలు పొడసూపిన నేపథ్యంలో అసంతృప్త నేతలను కలిసి ఓదార్చాలని శశికళ నిర్ణయించినట్టు చెబుతున్నారు. మరో మూడు నెలల్లోనే శశికళ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని ఆమె మద్దతుదారులు పేర్కొన్నారు.