జపాన్‌లో  భారీ భూకంపం.. సునామీ భయం లేదన్న యూఎస్‌జీఎస్

01-05-2021 Sat 09:47
  • ఈ ఉదయం భారీ భూకంపం
  • పసిఫిక్ సముద్రంలో 47 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
  • తూర్పుతీరం, టోక్యోలోని పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు
  • బుల్లెట్ సహా రైలు సర్వీసులు రద్దు
Powerful Earthquake jolts Japan

జపాన్ ఈశాన్య తీరంలో ఈ ఉదయం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మియాగీలోని ఇషినోమకి వద్ద పసిఫిక్ సముద్రంలో 47 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) గుర్తించింది. ఈ ప్రాంతానికి సమీపంలో 2011లో సంభవించిన భూకంపం కారణంగా 18 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.

భూకంపం కారణంగా తూర్పు తీరంతోపాటు టోక్యోలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు కనిపించినట్టు పేర్కొంది. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారమూ లేదని అధికారులు తెలిపారు. అయితే, స్థానిక రైల్వే మాత్రం బుల్లెట్ రైలు సహా పలు సర్వీసులను నిలిపివేసింది.