అమరావతి ఉద్యమం 1000 రోజులు చేయండి... ఎవరు వద్దన్నారు?: బొత్స

30-04-2021 Fri 20:44
  • కోర్టుకు వెళ్లడం వల్లే అభివృద్ధి ఆలస్యం అవుతోందన్న బొత్స
  • అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
  • రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నామని స్పష్టీకరణ
  • ఉద్యోగుల డిమాండ్ పైనా బొత్స స్పందన
Botsa comments on Amaravati agitation

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి ఉద్యమంపై స్పందించారు. అమరావతి ఉద్యమం 500 రోజులు కాదు, వెయ్యి రోజులు చేయండి... ఎవరు వద్దన్నారు? అంటూ వ్యాఖ్యానించారు. కోర్టులకు వెళ్లడం వల్లే అమరావతిలో ప్లాట్ల అభివృద్ధి ఆలస్యం అవుతోందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స స్పష్టం చేశారు. అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని వెల్లడించారు.

ఇక, ఏపీ సెక్రటేరియట్ లో కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండడంతో ఉద్యోగుల జేఏసీ వర్క్ ఫ్రం హోం డిమాండ్ చేస్తోంది. దీనిపైనా బొత్స తన అభిప్రాయాలు వెల్లడించారు. కరోనా వేళ ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని మంత్రి బొత్స కితాబిచ్చారు. అయితే అన్ని విషయాలు అంగీకరించాకే ఉద్యోగులు పనిచేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సాధ్యపడదన్న విషయం గమనించాలని సూచించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రం హోం సాధ్యపడుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్షేత్రస్థాయి పనులు ఉంటాయి కాబట్టి వర్క్ ఫ్రం హోం వీలుకాదని అభిప్రాయపడ్డారు.