'అన్నాత్తే' కోసం స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన నయన్!

28-04-2021 Wed 10:09
  • రజనీ జోడీగా నయనతార
  • హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్
  • దీపావళికి ప్రేక్షకుల ముందుకు  

Nayanatara came to Hyderabad in special flight for Annaatthe shooting

రజనీకాంత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' సినిమా రూపొందుతోంది. కరోనా కారణంగా ఆ మధ్య వాయిదా పడిన షూటింగ్, తిరిగి ఇటీవలే మళ్లీ మొదలైంది. అయితే అంతకుముందు కంటే ఇప్పుడు కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది .. అయినా జాగ్రత్తలు తీసుకుంటూ, హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగు కానిచ్చేస్తున్నారు. రజనీకాంత్ పట్టుదలే ఇందుకు కారణం అని అంటున్నారు. ఈ సినిమాలో రజనీ సరసన నాయికగా నయనతార నటిస్తోంది. తాజాగా రజనీ .. నయన్ కాంబినేషన్ లోని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా షూటింగు కోసం నయనతార చెన్నై నుంచి హైదరాబాద్ కి ప్రత్యేక విమానంలో వచ్చింది. కరోనా మొదలయ్యాక  వేరే ప్రాంతాల షూటింగ్స్ కి నయనతార ప్రత్యేక విమానంలోనే వెళుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఆమె 'అన్నాత్తే' షూటింగు కోసం కూడా స్పెషల్ ఫ్లైట్ లోనే వచ్చింది. ఆమె కాంబినేషన్ సీన్స్ ను మే 10వ తేదీ వరకూ  ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తారట. జాకీష్రాఫ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, ఖుష్బూ .. మీనా .. కీర్తి సురేశ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. దీపావళికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.