America: భారత్‌కు ప్రయాణాలు వద్దన్న అమెరికా.. మూడు రెట్లు పెరిగిన విమాన చార్జీలు

  • గతంలో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ. 50 వేలు
  • ఇప్పుడు లక్షన్నర రూపాయలు
  • చార్టర్డ్ విమానాలకూ పెరిగిన డిమాండ్
Air Ticket Rates Tripled between India and America

భారత్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఆదేశానికి వెళ్లొద్దంటూ అమెరికా చేసిన ప్రకటనతో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే కనుక ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని చాలామంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ను వీడి అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ దేశానికి వెళ్లే విమానాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. టికెట్ ధరలు ఏకంగా మూడు రెట్లు పెరిగాయి.

గతంలో ఎకానమీ క్లాస్ టికెట్ ధర సగటున రూ. 50 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, చార్టర్డ్ విమానాలకు కూడా డిమాండ్ పెరిగినట్టు ముంబైలోని ఓ విమానయాన సంస్థ పేర్కొంది. కరోనా బారినపడిన సంపన్న వర్గాలకు చెందిన వారు చార్టర్డ్ విమానాలను ఎయిర్ అంబులెన్సులుగా వినియోగిస్తున్నారని, అందుకనే వాటి ధరలు కూడా రెట్టింపు అయినట్టు చెబుతున్నారు. కాగా, జర్మనీ, యూకే, యూఏఈ, ఇరాన్ తదితర దేశాలు భారత్‌ నుంచి వచ్చే విమానాలను నిషేధించాయి.

More Telugu News