YS Sharmila: ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు... కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వండి కేసీఆర్ సారూ!: షర్మిల

  • దేశంలో మూడో విడత కరోనా వ్యాక్సినేషన్
  • మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడినవారికీ వ్యాక్సిన్
  • తెలంగాణలోనూ ఉచితంగా ఇవ్వాలన్న షర్మిల
  • కాంట్రాక్టర్లకు వేల కోట్లు అప్పనంగా ముట్టచెబుతున్నారని ఆరోపణలు
  • ప్రజల కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా? అంటూ ట్వీట్
Sharmila demands CM KCR free vaccine should provide in Telangana

కరోనా విజృంభణ మరింత తీవ్రం కాగా, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా నిర్వహించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే 45 ఏళ్లకు పైబడిన వారికి కరోనా టీకా ఉచితంగా వేస్తుండగా, మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రాలు మూడో విడత వ్యాక్సినేషన్ కోసం సిద్ధమవుతున్నాయి. అయితే, ఈసారి వ్యాక్సినేషన్ కూడా ఉచితంగానే కొనసాగించాలన్న వాదనలు ఊపందుకున్నాయి. ఏపీలో 18 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తామని సీఎం జగన్ నిన్న ప్రకటించారు.

ఈ నేపథ్యంలో, తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని, తెలంగాణలోనూ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. "కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పజెప్పగా లేనిది... ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా కేసీఆర్ గారూ? ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వండి సారూ!" అని షర్మిల ట్విట్టర్ లో పేర్కొన్నారు.

More Telugu News