nv ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ జస్టిస్‌ ఎన్వీ రమణ

nv ramana takes oath
  • జస్టిస్‌ ఎన్వీ రమణతో ప్ర‌మాణ స్వీకారం చేయించిన‌ రాష్ట్రపతి
  • ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ హాజ‌రు
  • 16 నెలల పాటు సీజేఐగా కొన‌సాగ‌నున్న జ‌స్టిస్ రమణ
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ప‌లువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతిథులు త‌క్కువ మంది హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. కాగా, 2022, ఆగస్టు 26 వరకు (16 నెలల పాటు) సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఆ బాధ్య‌తల్లో నియమితులైన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నిలిచారు. 1966-67 మ‌ధ్య కాలంలో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో పొన్నవరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో 1957 ఆగస్టు 27న జ‌న్మించిన జస్టిస్ ఎన్వీ రమణ 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు.

1983 నుంచి న్యాయవాదిగా బాధ్య‌తలను నిర్వహించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, అనంత‌రం ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గానూ వ్య‌వ‌హ‌రించారు. 2014 ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానానికి పదోన్నతి పొందారు.




nv ramana
Supreme Court

More Telugu News