Haryana: దొంగిలించిన వందలాది టీకాలను వెనక్కు ఇచ్చేసిన 'మంచి దొంగ'!

A Thief Returned Stolen Vaccine Vials and Says Sorry
షార్ట్స్‌లో చూడండి
అతనో దొంగ. చేతికి దొరికిన టీకాల బాక్స్ ను దొంగిలించుకుని పోయాడు. హర్యానాలోని జింద్ ప్రాంతంలో ఈ ఘటనపై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇంతలో ఆ దొంగలో మానవత్వం పరిమళించినట్టుంది. తనను క్షమించాలని కోరుతూ ఓ లెటర్ రాసిపెట్టి మరీ, దొంగిలించిన టీకా వయల్స్ ను తిరిగి తెచ్చిచ్చాడు. బుధవారం రాత్రి ఆసుపత్రి స్టోర్ నుంచి టీకాలు దాచిన ఓ బాక్స్ పోయింది. ఇందులో 1,270 కొవీషీల్డ్, 440 కొవాగ్జిన్ వయల్స్ ఉన్నాయి. జరిగిన ఘటనపై ఆసుపత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు విచారిస్తున్న క్రమంలో, గుర్తు తెలియని ఆ దొంగ, నిన్న మధ్యాహ్నం సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ సమీపంలో ఓ బ్యాగ్ ఉంచి వెళ్లాడని, డీసీపీ జితేంద్ర ఖట్కాడ్ వెల్లడించారు. ఆ బ్యాగ్ ను తెరచి చూడగా, వ్యాక్సిన్ తో పాటు, స్వయంగా రాసిన లేఖ కూడా ఒకటి ఉందని తెలిపారు. "నన్ను క్షమించండి. ఇందులో కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉందన్న విషయం నాకు తెలియదు" అని రాసుంది.

ఇదిలావుండగా, ఈ వ్యాక్సిన్ వయల్స్ ఉంచిన స్టోర్ లోనే ఓ ల్యాప్ టాప్, రూ. 50 వేల వరకూ నగదు కూడా ఉందని వెల్లడించిన ఓ మెడికల్ ఆఫీసర్, సదరు దొంగ వీటి జోలికి పోలేదని తెలిపారు. ఈ కేసులో ఇంతవరకూ పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఆ దొంగ ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని జితేంద్ర ఖట్కాడ్ తెలిపారు. హర్యానా రాష్ట్రంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య పాత రికార్డులను దాటేస్తుండటంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Go Back to Shorts
Haryana
Jind
Thief
Vaccine
Theft

More Telugu News