Mansoor Ali Khan: వ్యాక్సిన్ పై దుమారం రేపిన నటుడు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలు.. వివేక్ మరణాన్ని తట్టుకోలేకే అలా మాట్లాడానంటూ కోర్టుకు వివరణ!

Mansoor Ali Khan files for bail after BJP files complaint against him
  • వైరస్ పొలిటికల్ స్టంటే
  • వ్యాక్సిన్ పేరుతో వివేక్‌ను మంచమెక్కించారని వ్యాఖ్య
  • ముందస్తు బెయిలు కోసం కోర్టుకు
కోలీవుడ్ హాస్యనటుడు వివేక్ మృతి తర్వాత నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేక్ మరణాన్ని ప్రస్తావిస్తూ ఆరోగ్యంగా ఉన్న మనిషిని వ్యాక్సిన్ పేరుతో మంచమెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ అనేది ప్రజలను గుప్పిట్లో ఉంచుకునేందుకు పాలకులు చేస్తున్న పొలిటికల్ స్టంట్ తప్పితే మరోటి కాదని ఆరోపించారు.

మన్సూర్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో స్పందించిన చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాశ్ ఆయనపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీకా విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుపై వడపళని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

దీంతో తనను అరెస్ట్ చేయకుండా మన్సూర్ కోర్టును ఆశ్రయించారు. వివేక్ లాంటి మంచి మిత్రుడిని కోల్పోయిన బాధలో అలా వ్యాఖ్యానించాను తప్పితే తనకు ఎలాంటి దురుద్దేశం లేదని న్యాయవాదుల ద్వారా కోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. మన్సూర్ బెయిల్ పిటిషన్‌ నేడు, లేదంటే రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Mansoor Ali Khan
Bail
BJP
COVID19
Actor Vivek

More Telugu News