Joe Biden: ఇక అమెరికన్లందరూ టీకాకు అర్హులే!

AllAmericans Are Eligable for Vaccination in USA from April 19th
  • నేడు కీలక ప్రకటన చేయనున్న జో బైడెన్
  • వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్
  • రోజుకు మూడు కోట్ల మందికి పైగా టీకా
టీకా పంపిణీలో ముందుగా విధించుకున్న లక్ష్యాలను అధిగమించేందుకు అమెరికాలోని అందరికీ టీకాను అందించాలని అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. ఈ మేరకు నేడు ఆయన కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నెల 19 నుంచి బాల బాలికలు మినహా అందరికీ టీకాను అందించడాన్ని ప్రారంభించనున్నామని బైడెన్ స్వయంగా ప్రకటిస్తారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి మే 1 నుంచి అందరికీ టీకాను ఇస్తారని తొలుత భావించినప్పటికీ, ఇప్పుడు దాన్ని మరింత ముందుకు తీసుకునివచ్చారు. దేశంలోని 50 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా జరుగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తాజా లక్ష్యాన్ని కూడా చేరుకోగలిగితే, వయసు నిబంధనలన్నీ తొలగించాలన్నది అధ్యక్షుడి అభిమతమని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఇతర కేటగిరీల్లో ఉండి వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రస్తుతం వ్యాక్సిన్ అందడం లేదు. కొన్ని డిస్ట్రిబ్యూషన్ సమస్యలు ఉండగా, వాటిని అధిగమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

కాగా, నేడు వర్జీనియాలోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బైడెన్ నేడు సందర్శించనున్నారు. ఆపై వైట్ హౌస్ లో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.  అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడి, వేగంగా దూసుకెళ్లాలంటే, భారీ ఎత్తున వ్యాక్సిన్ సరఫరా ఒక్కటే మార్గమని బైడెన్ భావిస్తున్నారు. దేశ వాసులందరికీ టీకాను అందిస్తే, కరోనా మహమ్మారిపై విజయం సాధించినట్టేనని అంచనా వేస్తున్న ఆయన, ఈ దిశగా లక్ష్యాన్ని సాధ్యమైనంత తొందరలో అందుకోవాలని అనుకుంటున్నారు.

యూఎస్ లో రోజుకు 10 లక్షల మందికి టీకాను ఇవ్వాలని తొలుత నిర్ణయించగా, ఆ లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించిన అధికారులు, ప్రస్తుతం రోజుకు 31 లక్షల మందికి టీకాను ఇస్తున్నారు. వారాంతాల్లో అయితే, 40 లక్షల మంది వరకూ టీకాను తీసుకుంటున్నారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే 15 కోట్ల టీకా డోస్ లను అందించామని అధికారులు వెల్లడించారు. తొలి 100 రోజుల్లో 10 కోట్ల డోస్ లను ఇవ్వాలని నిర్ణయించగా, సమయం పూర్తయ్యేసరికి 20 కోట్ల డోస్ ల పంపిణీ పూర్తవుతుందని అంటున్నారు.
Joe Biden
Vaccination
USA

More Telugu News