Mamata Banerjee: డొనాల్డ్ ట్రంప్ ను మించిన ఘోరాలు చేస్తున్న నరేంద్ర మోదీ: మమతా బెనర్జీ నిప్పులు

Mamata Benerjee Fires on Narendra Modi
  • అకృత్యాలకు దిగుతున్న బలగాలు
  • బీజేపీకి ఓటేయాలని ప్రజలకు బెదరింపులు
  • ఢిల్లీలో కూర్చుని కుట్రకు తెరదీసిన బీజేపీ
  • స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని మమత సూచన
బీజేపీకే ఓటు వేయాలని ఎన్నికల్లో భద్రత నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్ ఓటర్లను బెదరిస్తున్నాయని తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మూడవ దశ ఎన్నికల వేళ సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలు అకృత్యాలకు దిగుతున్నాయని, వారి ఆగడాలపై తనకు 100కు పైగా ఫిర్యాదులు వచ్చాయని ఆమె ఆరోపించారు.

 సెక్యూరిటీ సిబ్బంది పోలింగ్ బూత్ లను ఆక్రమించుకుని, రిగ్గింగ్ చేస్తున్నాయని అన్నారు. బీజేపీ నేతలు నిర్వహించిన సభలకు ప్రజలు రాలేదని, దీంతో రాష్ట్రానికి రాలేక, ఢిల్లీలో కూర్చుని ఈ తరహా కుట్రకు తెరదీశారని విమర్శలు గుప్పించారు. బీజేపీకి మద్దతుగా వ్యవహరించాలని కేంద్ర బలగాలకు ఆదేశాలు అందాయని, తుపాకులు ప్రయోగించి, ఈ ఎన్నికలను నియంత్రించాలని భావిస్తున్నారని అన్నారు.

అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటువంటి ఘోరాలను చేయలేదని, ట్రంప్ తో పోలిస్తే, నరేంద్ర మోదీ మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్ర బలగాల్లో ఎవరైనా వేధిస్తే, లోకల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని మహిళలకు ఆమె సలహా ఇచ్చారు.

ఇక, బీజేపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెడుతోందని ఆరోపించిన ఆమె, పెద్ద హోటళ్లలోని రూములన్నింటినీ బీజేపీ నేతలు బుక్ చేసుకున్నారని, ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారని, ఈ డబ్బులు పీఎం కేర్స్ నిధి నుంచి తెచ్చారా? లేక నోట్ల రద్దు నుంచి తెచ్చారా? అని ప్రశ్నించారు. ఈ రెండూ కాకుంటే, పీఎస్యూ సంస్థలను అమ్మి డబ్బును తీసుకుని వచ్చినట్టున్నారని సెటైర్లు వేశారు. మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న నేతలతో కూడిన పార్టీ బీజేపీ అని అన్నారు. గుజరాత్, యూపీ, ఢిల్లీ, అసోం రాష్ట్రాల తరువాత వారు బెంగాల్ పై పడ్డారని అన్నారు.
Mamata Banerjee
Narendra Modi
Donald Trump
Elections

More Telugu News