ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ కు హైదరాబాదు పబ్ లో చేదు అనుభవం... ఆలస్యంగా వెల్లడి!

09-03-2021 Tue 15:32
  • హైదరాబాదులోని పబ్ లో ఇటీవల ఓ కార్యక్రమం
  • కచేరీలో పాల్గొన్న సిద్ శ్రీరామ్
  • పాటలు పాడుతుండగా మద్యం, నీళ్ల సీసాలు విసిరిన ఆకతాయిలు
  • అయినప్పటికీ పాటలు పాడిన సిద్
Sid Sriram faces strange situations in a Hyderabad pub

చాలా తక్కువ వ్యవధిలోనే అగ్రశ్రేణి సినీ గాయకుడిగా ఎదిగిన సిద్ శ్రీరామ్ కు హైదరాబాదులోని ఓ పబ్ లో అనూహ్య పరిణామం ఎదురైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని సన్ బర్న్ పబ్ లో కొన్నిరోజుల కిందట జరిగిన వేడుకలో సిద్ శ్రీరామ్ కచేరీ కూడా ఏర్పాటు చేశారు. అందుకోసం నిర్వాహకులు పరిమితికి మించి భారీగా టికెట్లు విక్రయించారు. దాంతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రాంతం కిక్కిరిసిపోయింది.

ఈ క్రమంలో సిద్ శ్రీరామ్ పాడుతుండగా కొందరు వ్యక్తులు ఆయనపై మద్యం చల్లుతూ, నీళ్ల సీసాలు విసురుతూ రసాభాస చేశారట. దాంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయితే, ఇలాంటి ఘటనలు మునుపెన్నడూ చూడని సిద్ శ్రీరామ్ వెంటనే తేరుకుని కచేరీ కొనసాగించారు. ఆ తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు. మనసును అదుపులో పెట్టుకుంటే పనిచేసే ప్రదేశంలో భయం ఉండదు అని ఈ ఘటనను దృష్టిలో ఉంచుకునే ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెల్లడైంది.