Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎలా డీల్ చేయాలనే విషయం జగన్ కు తెలుసు: సజ్జల

  • స్టీల్ ప్లాంట్ ను ఎలా డీల్ చేయాలో కేంద్రానికి జగన్ సూచనలు ఇచ్చారు
  • కృష్ణపట్నంకు రావాలని పోస్కో కంపెనీకి జగన్ సూచించారు
  • చంద్రబాబు కంటే మేము 100 రెట్లు బాగా డీల్ చేస్తాం
Jagan knows how to deal with Vizag steel says Sajjala

వైజాగ్ స్టీల్ ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని పార్లమెంటు సాక్షిగా నిన్న కేంద్ర ప్రబుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ప్లాంటులో 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిర్మల ప్రకటనను కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకురావడానికి కేంద్రానికి సూచనలు చేశామని... ప్రభుత్వ రంగంలోనే ప్లాంటును కొనసాగించాలని చెప్పామని తెలిపారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని మండిపడ్డారు.

వైజాగ్ ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారని సజ్జల చెప్పారు. ప్లాంటును వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రానికి సీఎం సూచనలు చేశారని తెలిపారు. వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను కలసి విజ్ఞప్తులు చేశారని చెప్పారు. కడప, కృష్ణపట్నంకు రావాలని పోస్కో కంపెనీకి జగన్ సూచించారని తెలిపారు. ఆ కంపెనీ ప్రతినిధులు కృష్ణపట్నంకు కూడా వెళ్లొచ్చారని చెప్పారు. పోస్కో కంపెనీకి ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు.

విశాఖ ప్లాంట్ విషయంలో జగన్ నిర్ణయాత్మకమైన వైఖరి తీసుకున్నారని సజ్జల చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయం కేంద్ర ప్రభుత్వ ఆస్తి అని... దాన్ని ఎలా నిర్వహించుకుంటారనేది వారి ఇష్టమని.. ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే కార్మికుల పరిస్థితి ఏమిటనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన చేస్తుందని తెలిపారు.

ఈ విషయంపై జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్రం మెడలు వంచొచ్చు కదా? అని సజ్జల ప్రశ్నించారు. ఏ అడుగు ఎలా వేయాలి, ఎలా డీల్ చేయాలనే విషయం జగన్ కు బాగా తెలుసని... చంద్రబాబు కంటే 100 రెట్లు తాము బాగా డీల్ చేస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అందరం కలసి పని చేయాల్సి ఉందని... సవాళ్లు చేసుకుంటే ఫలితం ఉండదని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర హోం మంత్రికి జగన్ లేఖ ఇవ్వలేదని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయని... అమిత్ షా వద్దకు జగన్ వ్యక్తిగతంగా వెళ్లి లేఖ ఇస్తే... ఆ లేఖ హోం శాఖ వద్ద ఎలా ఉంటుందని సజ్జల ప్రశ్నించారు. ఆ లేఖ గురించి దాచాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. జగన్ పై బురద చల్లాలని విపక్షాలు యత్నిస్తున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News