త్వరలో తల్లి కానున్న గాయని శ్రేయా ఘోషల్

04-03-2021 Thu 12:07
  • 'బేబీ శ్రేయాదిత్య కమింగ్‌' అంటూ  ట్వీట్
  • జీవితంలో ఈ సరికొత్త విష‌యాన్ని షేర్ చేస్తున్నాన‌ని హర్షం
  • అందరి ప్రేమ, ఆశీస్సులు కావాల‌ని  వ్యాఖ్య‌
Shreya Ghoshal Announces Pregnancy

ప్ర‌ముఖ సినీ గాయని శ్రేయా ఘోషల్ తల్లి కాబోతోంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. 2015, ఫిబ్రవరి 5న ఆమె తన స్నేహితుడు శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లి చేసుకుంది. 'బేబీ శ్రేయాదిత్య కమింగ్‌' అంటూ ఆమె ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేసింది. తమ జీవితంలో ఈ సరికొత్త విష‌యాన్ని షేర్ చేసుకోవ‌డం సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. అందరి ప్రేమ, ఆశీస్సులు కావాల‌ని పేర్కొంది. హిందీ, తెలుగుతో పాటు అనేక భార‌తీయ భాష‌ల్లో ఆమె పాటలు పాడింది.

సంజయ్ లీలా భన్సాలీ 2000లో ఆమెకు హిందీ దేవదాసు సినిమాలో  5 పాటలను పాడే అవ‌కాశం ఇచ్చారు. మొద‌టి సినిమాలోని పాట‌ల‌కే ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ద‌క్కింది. ఉత్తమ నేపథ్య గాయనిగా ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది. ఆ త‌ర్వాత ఆమె వెనుదిరిగి చూడ‌లేదు. ఇటీవల విడుద‌లైన‌ ఉప్పెన సినిమాలోని 'జల జల జలపాతం' అనే పాటను పాడింది ఆమే. బిడ్డకు జ‌న్మినిస్తున్న శ్రేయా ఘోషల్‌కు అభిమానులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.