Pakistan: విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Pakistan PM Imran Khan to seek vote of confidence after election setback
  • ప్రకటించిన పాక్ విదేశాంగ మంత్రి
  • దిగువ సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆర్థిక మంత్రి
  • విశ్వాస పరీక్ష అనివార్యమైందని వెల్లడి
  • ఎగువ సభకూ జరుగుతున్న ఎన్నికలు
  • ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని ఇమ్రాన్ పార్టీ తహతహ
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. దిగువ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ఆర్థిక మంత్రి ఓడిపోయారు. దీంతో విశ్వాస పరీక్ష అనివార్యమైందని పాక్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. అయితే, ఎప్పుడు పెట్టేది మాత్రం వెల్లడించలేదు.

మరోవైపు 104 మంది సభ్యులున్న ఎగువ సభలో ప్రస్తుతం ప్రతిపక్షాల ఆధిపత్యం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖాళీ అయిన 37 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లో గెలిచి ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని అధికార పార్టీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ), దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎగువ సభకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

ఈ లోపే దిగువ సభ స్థానానికి జరిగిన ఎన్నికలో ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓడిపోయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో దిగువ సభలో అధికార పార్టీ సంఖ్యా బలం ఒకటి తగ్గినట్టయింది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి వెల్లడించారు.

అయితే, విశ్వాస పరీక్షలో అధికార పక్షానికి సరిపడా మెజారిటీ ఉందని అధికార వర్గాలంటున్నాయి. ఆర్థిక మంత్రి ఒక్కరు ఓడిపోయినంత మాత్రాన ఇమ్రాన్ కు వచ్చిన నష్టమేమీ లేదని చెబుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, మళ్లీ ఎన్నికలు పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆందోళనలు, నిరసనలకూ పిలుపునిచ్చాయి.
Pakistan
Imran Khan
Parliament

More Telugu News