అందుకే దేశంలో పెట్రోలు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి: కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

28-02-2021 Sun 16:02
  • ధ‌ర‌లు ఎప్పుడు త‌గ్గుతాయో క‌చ్చితంగా చెప్ప‌లేం
  • ముడి చ‌మురు ఉత్ప‌త్తి చేసే దేశాలు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఉత్ప‌త్తిని త‌గ్గించాయి
  • ఉత్ప‌త్తిని పెంచాల‌ని ర‌ష్యా, ఖ‌తార్‌, కువైట్ కు చెప్పాం
petrol rates may reduce says pradhan

దేశంలో పెట్రోలు ధ‌ర‌లు రోజురోజుకీ పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. ప‌లు ప్రాంతాల్లో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.100 దాటింది. దీంతో సామాన్య‌ ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స్పందిస్తూ... వాటి ధ‌ర‌లు ఎప్పుడు త‌గ్గుతాయో క‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని తెలిపారు.

అయితే, వ‌చ్చే నెల లేదా ఏప్రిల్‌లో త‌గ్గే అవకాశం ఉన్న‌ట్లు చెప్పారు. ముడి చ‌మురు ఉత్ప‌త్తి చేసే దేశాలు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఉత్ప‌త్తిని త‌గ్గించ‌డం వ‌ల్లే మ‌న దేశంలో ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్లు తెలిపారు. వాటి ఉత్ప‌త్తిని పెంచాల‌ని ర‌ష్యా, ఖ‌తార్‌, కువైట్ ‌లాంటి దేశాల‌పై తాను ఒత్తిడి తెస్తున్న‌ట్లు చెప్పారు.

ఒక‌వేళ ఉత్ప‌త్తి పెరిగితే బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర త‌గ్గుతుంద‌ని ఆయ‌న తెలిపారు. దీంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. గ‌త ఏడాది ఏప్రిల్‌లో ఆయా దేశాలు ఉత్ప‌త్తిని త‌గ్గించాయని, ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డంతో డిమాండ్ పెరిగినప్ప‌టికీ ఆ దేశాలు ఉత్ప‌త్తిని పెంచ‌‌డం లేదని తెలిపారు.