స్వాతంత్య్ర దినోత్స‌వ వేడు‌క‌ల్లో పాల్గొన‌డానికి.. శ్రీ‌లంక చేరుకున్న భార‌త యుద్ధ విమానాలు

28-02-2021 Sun 15:49
  • శ్రీలంక‌కు తేజ‌స్, సూర్య కిరణ్‌, సారంగ్
  • వ‌చ్చేనెల‌ 3 నుంచి 5వ తేదీ వరకు  విన్యాసాలు
  • సత్సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌తాయి: శ్రీలంక
iaf aircrafts in srilanka

భారత వైమానిక ద‌ళానికి చెందిన యుద్ధ విమానాలు సూర్య కిరణ్‌, సారంగ్‌, తేజస్ శ్రీలంక చేరుకున్నాయి. శ్రీలంక 70వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తోన్న విన్యాసాల్లో అవి పాల్గొన‌నున్నాయి. వ‌చ్చేనెల‌ 3 నుంచి 5వ తేదీ వరకు ఈ  విన్యాసాలు జ‌రుగుతాయి. వీటిల్లో పాల్గొన‌డం వ‌ల్ల ఇరు దేశాల మ‌ధ్య ఉన్న సత్సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌తాయ‌ని శ్రీలంక చెప్పింది.  

ఈ నేప‌థ్యంలోనే నిన్న భార‌త యుద్ధ విమానాలు అక్క‌డ‌కు చేరుకున్నాయి. 2001లో జరిగిన శ్రీలంక 50వ స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకల్లో కూడా సూర్యకిరణ్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.  శ్రీలంక వైమానిక దళంతో భార‌త్ ప‌లు చర్చ‌ల్లోనూ పాల్గొంటోంది. సంయుక్త‌  శిక్షణ, సైనిక విద్యవంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోవడం వంటి అంశాల‌పై ఇరు దేశాలు చ‌ర్చిస్తాయి.