యువకుడి మృతి కేసులో కోడి అరెస్ట్.. ఏ1 ముద్దాయిగా కోడి!

26-02-2021 Fri 15:33
  • జగిత్యాల జిల్లాలో ఘటన
  • కోడికి కట్టిన కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి
  • కోడిని లాకప్ లో పెట్టిన పోలీసులు
Cock arrested in man death case

వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పందెం కోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని సతీశ్ అనే యువకుడు మృతి చెందాడు. కోడిని పందెంలోకి దింపే సమయంలో ఈ ఘటన జరిగింది.

కత్తి కట్టిన కాలుని కాకుండా మరోకాలుని సతీశ్ పట్టుకున్నాడు. అయితే కోడి తప్పించుకునే ప్రయత్నం చేయగా... దానికి కట్టిన కత్తి సతీశ్ పొట్టలో గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడ్డ సతీశ్ ని ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సతీశ్ మరణానికి కారణమైన కోడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. లాకప్ లో దాన్ని కట్టేశారు. కేసులో ఏ1గా కోడిని చేర్చారు. మరోవైపు ఆ కోడిని పోలీసులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. దానికి తిండి, నీరు అందిస్తున్నారు. అప్పుడప్పుడు దాన్ని స్టేషన్ ప్రాంగంణలో ఉన్న చెట్టుకు కూడా కట్టేస్తున్నారు. మరోవైపు కోడి కూతలతో స్టేషన్ హోరెత్తిపోతోంది. కోడి పందేలను నిర్వహించినవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.