శివకాశిలో భారీ పేలుడు... ఆరుగురి మృతి

25-02-2021 Thu 20:30
  • శివకాశి బాణసంచా కర్మాగారంలో పేలుడు
  • ఫ్యాన్సీ రకం టపాకాయలు తయారుచేస్తుండగా ప్రమాదం
  • గుర్తుపట్టడానికి వీల్లేనంతగా కాలిపోయిన మృతదేహాలు
  • 14 మందికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
Huge explosion at a fireworks factory in Tamilnadu

తమిళనాడులోని శివకాశి ప్రాంతం బాణసంచా తయారీ కర్మాగారాలకు నెలవు. అక్కడ ప్రమాదాలు కూడా ఎక్కువే. గత కొన్నిరోజులుగా పేలుళ్లతో దద్దరిల్లుతున్న శివకాశి ప్రాంతంలో నేడు కూడా భారీ పేలుడు ఘటన జరిగింది. విరుదునగర్ జిల్లా కాళయ్యర్ కురిచ్చిలోని ఓ బాణసంచా పరిశ్రమలో ఫ్యాన్సీ రకం టపాకాయలు తయారుచేస్తుండగా విస్ఫోటనం సంభవించింది.

ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి 10 గదులు నేలమట్టం అయ్యాయి. మృతదేహాలు బాగా కాలిపోవడంతో గుర్తించడం కష్టమైందని అధికారులు తెలిపారు. శివకాశి ప్రాంతంలో గత రెండు వారాల వ్యవధిలో ఇది మూడో పేలుడు ఘటన.