టీడీపీ తరఫున గెలిచిన 42 శాతం మంది ఎవరో చంద్రబాబు చెప్పగలరా?: కొడాలి నాని

22-02-2021 Mon 16:19
  • ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు
  • ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారన్న కొడాలి నాని
  • మున్సిపల్ ఎన్నికల్లోనూ తమదే హవా అని వెల్లడి
  • చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని విమర్శలు
  • చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ వ్యాఖ్యలు
Kodali Nani slams TDP Chief Chandrababu

పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబుకు పిచ్చెక్కిందని, ఆయనను టీడీపీ నేతలు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపడం ఖాయమని అన్నారు. కుప్పంలోనే తాము 75 స్థానాలు సాధించామని, మరి చంద్రబాబు చెబుతున్న 42 శాతం సీట్లు ఎక్కడో చెప్పాలని కొడాలి నాని నిలదీశారు.

పిచ్చి పట్టిన చంద్రబాబు ఇప్పటికే తెలంగాణలో పార్టీని నాశనం చేశాడని, చంద్రబాబును ఇకనైనా మెంటల్ ఆసుపత్రిలో చేర్చకపోతే ఏపీలోనూ టీడీపీకి అదేగతి పడుతుందని అన్నారు. చంద్రబాబు జూమ్ యాప్ లో కూర్చుని పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పార్టీ గుర్తులు ఉండవని, అలాంటి ఎన్నికల్లోనే తమకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇక పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదని నాని ధీమా వ్యక్తం చేశారు.