asaruddin: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో స్థానికుల‌కు చోటు లేక‌పోవ‌డంపై అజారుద్దీన్ ఆగ్ర‌హం

  • నిన్న  ఐపీఎల్ 14వ సీజన్ కోసం వేలం
  • ఒక్క స్థానికుడినీ హైద‌రాబాద్ తీసుకోలేద‌న్న‌ అజారుద్దీన్
  • తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని ట్వీట్  
asaruddin slam srh team franchises

ఐపీఎల్ 14వ సీజన్ కోసం నిన్న చెన్నైలో వేలం నిర్వహించిన విష‌యం తెలిసిందే. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఒక్క స్థానిక ఆట‌గాడికి కూడా చోటు ద‌క్క‌లేదు. ఇత‌ర జట్లు కొన్ని మాత్రం స్థానిక ఆట‌గాళ్ల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చాయి.

స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై జ‌ట్టు తీసుకుంది. ప‌లు టీమ్‌లలోనూ స్థానిక ఆట‌గాళ్లు ఉన్నారు. హైద‌రాబాద్ జ‌ట్టు యాజమాన్యం మాత్రం స్థానిక ఆటగాళ్లను తీసుకోక‌పోవ‌డంపై సామాజిక మాధ్య‌మాల్లో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్ కూడా స్పందిస్తూ విమ‌ర్శలు గుప్పించారు.

స్థానిక ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఒక్కరికీ స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా, హైదరాబాద్‌ జట్టు నుంచి కె.భగత్‌ వర్మను రూ.20 లక్షలు చెల్లించి చెన్నై సూపర్‌కింగ్స్ తీసుకోగా, ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్‌ భరత్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ.20 లక్షలకు, హరిశంకర్‌ రెడ్డిని రూ.20 లక్షలకు చెన్నై జ‌ట్టు తీసుకుంది.

ఇక్క‌డి ఆట‌గాళ్ల‌ను వేరే జ‌ట్లు తీసుకున్న‌ప్ప‌టికీ హైద‌రాబాద్ జ‌ట్టు వారిని విస్మ‌రించ‌డం స‌రికాద‌ని తెలుగువారు మండిపడుతున్నారు. అజారుద్దీన్ ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న విష‌యం తెలిసిందే.

More Telugu News