తీవ్రమైన మంచు తుపానుతో... టెక్సాస్ లో ఢీకొన్న 100కు పైగా వాహనాలు!

Accident of 100 Vehicles in Texas Because of Snow Cyclone
  • ఒకటిన్నర మైలు వ్యవధిలో ఢీకొన్న వాహనాలు
  • తుక్కుగా మారిపోయిన వాహనాలు
  • రహదారిని మూసివేసి, సహాయక చర్యలు
  • పలువురికి తీవ్ర గాయాలు
అది యూఎస్ఏలోని టెక్సాస్ రాష్ట్రం పరిధిలోని ఫోర్త్ విత్ సమీపంలోని 35వ ఇంటర్ స్టేట్ హైవే. తీవ్రమైన మంచు తుపాను మొదలైంది. ముందు ఏ వాహనం వెళుతుందో ఎంత మాత్రమూ తెలియని పరిస్థితిలో, ఒకటిన్నర మైలు వ్యవధిలో దాదాపు 100కు పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఒక వాహనం మరోదాన్ని ఢీకొందని తెలుసుకుని, దానిలోని వారు బయటకు వచ్చేలోగానే, వెనుక నుంచి వస్తున్న మరో వాహనం దాన్ని ఢీకొందని ప్రత్యక్ష వర్గాలు వెల్లడించాయి.

దాదాపు గంటకు పైగా ఇలాగే జరుగగా, కిలోమీటర్ల దూరం వాహనాలు తుక్కు తుక్కుగా పడివున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రహదారిని మూసివేసి, ప్రమాద స్థలికి ప్రత్యేక బృందాలను పంపించారు. వారు ఒక్కో వాహనాన్ని పరిశీలిస్తూ, అందులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ఈ ప్రమాదంలో చిక్కుకున్న అత్యధిక వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. దీంతో సహాయక చర్యల నిమిత్తం వచ్చిన బృందాలు సైతం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. కాగా, తొలుత ఫెడ్ ఎక్స్ కు చెందిన ఓ ట్రక్కు అదుపుతప్పి బారియర్ ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోగా, మరికొన్ని టక్కులు దాన్ని ఢీకొన్నాయి. దీంతో ప్రమాదం మొదలైంది.

టెక్సాస్ రాష్ట్రాన్ని షర్లీ మంచు తుపాను వణికిస్తున్న కారణంగా కెంటకీ, వెస్ట్ వర్జీనియా పరిధిలోని 1.25 లక్షల నివాసాలతో పాటు ఎన్నో వాణిజ్య ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. తుపాను కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Texas
Snow cyclone
Accident

More Telugu News