Sajjala Ramakrishna Reddy: గతంలో టీడీపీని వ్యతిరేకించిన 8 మంది హత్యకు గురయ్యారు: సజ్జల

  • నిమ్మాడలో ఇతరులు స్వేచ్ఛగా నామినేషన్ వేసిన సందర్భాలు లేవు
  • పట్టాభిపై దాడిలో టీడీపీ పాత్ర ఉంది
  • అంబేద్కర్, రంగా విగ్రహాల ధ్వంసాలకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు
 Eight people who opposed the TDP in the past have been killed says Sajjala Ramakrishna Reddy

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించేందుకు తెలుగుదేశం పార్టీ యత్నిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో వేరే అభ్యర్థి నామినేషన్ వేయకుండా టీడీపీ నేత అచ్చెన్నాయుడు అడ్డుకున్నారని అన్నారు.

నిమ్మాడలో ఇప్పటి వరకు ఇతరులు స్వేచ్ఛగా నామినేషన్ వేసిన సందర్భాలు లేవని చెప్పారు. దశాబ్దాల చరిత్ర ఉన్న అచ్చెన్నాయుడు కుటుంబం గురించి చంద్రబాబు ఏం చెపుతారని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడే ప్రజాస్వామ్యం ఇదేనా? అని నిలదీశారు.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యతిరేకించిన 8 మంది హత్యకు గురయ్యారని, ఒక మహిళను టీడీపీ నేతలు వివస్త్రను కూడా చేశారన్నారు.

పట్టాభిపై జరిగిన దాడిలో టీడీపీ పాత్ర ఉన్నట్టు అనుమానం కలుగుతోందని సజ్జల అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ను పక్కదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ఈ డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. బస్సులు తగలబెట్టడం చంద్రబాబు నైజమని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో పేర్కొన్నారని తెలిపారు. అంబేద్కర్, రంగా విగ్రహాల ధ్వంసానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. కాపులు, ఎస్సీల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నిమ్మాడకు ఎందుకు వెళ్లలేదని సజ్జల ప్రశ్నించారు. నిమ్మగడ్డ టీడీపీ వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఎస్ఈసీ యాప్ పై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని.... దీనికి బదులు సీఈసీ యాప్ ను వాడాలని డిమాండ్ చేశారు.

More Telugu News