Corona Virus: బ్రెజిల్ లో కొత్త పరిణామం... ఒకే వ్యక్తిలో రెండు రకాల కరోనా వైరస్ లు

  • పలు రకాలుగా కరోనా వైరస్ రూపాంతరం
  • బ్రెజిల్ లోనూ కొత్త స్ట్రెయిన్లు
  • ఇద్దరు వ్యక్తుల్లో ఏకకాలంలో రెండు స్ట్రెయిన్లు పాజిటివ్
  • వీటిలో ఒకటి ప్రమాదకర పీ1 రకం
Two corona variants in a Brazilian

కరోనా మహమ్మారి జన్యు ఉత్పరివర్తనాలతో రూపు మార్చుకోవడాన్ని శాస్త్రవేత్తలు ముందే ఊహించారు. వారి అంచనాలకు తగ్గట్టే బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ లు వెలుగుచూశాయి. అయితే, బ్రెజిల్ లో శాస్త్రవేత్తల అంచనాలకు అందని రీతిలో ఒకే వ్యక్తిలో రెండు కరోనా కొత్త రకాలను గుర్తించారు. ఇలాంటి కేసులు బ్రెజిల్ లో రెండు నమోదయ్యాయి. రెండు కరోనా రకాలు ఒకేసమయంలో సోకడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి డబుల్ కొవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు ఇవేనని భావిస్తున్నారు.

దక్షిణ బ్రెజిల్ లోని రియో గ్రాండే సూల్ ప్రాంతంలోని 90 మంది కరోనా రోగుల తెమడను పరీక్షించిన ఫీవేల్ వర్సిటీ పరిశోధకులు ఈ డబుల్ ఇన్ఫెక్షన్ కేసులను గుర్తించారు. వారిలో ఏకకాలంలో రెండు కరోనా రకాలు పాజిటివ్ గా తేలడం పరిశోధకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ వ్యక్తిలో వెల్లడైన రెండు కరోనా రకాలను బ్రెజిల్ లోనే రూపు మార్చుకున్న పీ1, పీ2గా గుర్తించారు. వీటిలో పీ1 ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ అని భావిస్తున్నారు. ఇది వ్యాక్సిన్ కు కూడా లొంగకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఒకే వ్యక్తిలో ప్రవేశించిన రెండు కరోనా రకాలు పరస్పరం తమ జన్యుకోడ్ ను మార్చుకుని ప్రమాదకరంగా పరిణమించే అవకాశం లేకపోలేదని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు గల అవకాశాలు స్వల్పం అని తెలుస్తోంది.

More Telugu News