పవన్ జోరు.. మరో సినిమాకు దర్శకుడి ఖరారు!

23-01-2021 Sat 21:33
  • సినిమాలలో స్పీడు పెంచుతున్న పవర్ స్టార్ 
  • ప్రస్తుతం క్రిష్ సినిమా షూటింగులో పవన్
  • ప్రీ ప్రొడక్షన్ పనులలో మరో రెండు సినిమాలు
  • బండ్ల గణేశ్ చిత్రానికి దర్శకుడిగా రమేశ్ వర్మ  
Pawan Kalyan gives nod for one more project

అటు తన రాజకీయ పార్టీ జనసేన కార్యక్రమాలలో ఓపక్క బిజీగా ఉంటూనే.. మరోపక్క సినిమాలలో కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పీడు పెంచుతున్నారు. ఇప్పటికే 'వకీల్ సాబ్' చిత్రాన్ని పూర్తిచేసిన ఆయన.. తాజాగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగులో కూడా ఆయన పాల్గొంటున్నారు.

అలాగే, మరోపక్క మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. దీనికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకోపక్క 'గబ్బర్ సింగ్' ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సినిమా విషయంలో కూడా పవన్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ త్వరలో పవన్ తో ఒక చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి మనకు తెలుసు. ఈ చిత్రానికి దర్శకుడిగా మహేశ్ వర్మకు పవన్ ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజతో మహేశ్ వర్మ 'ఖిలాడీ' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పవన్ కోసం ఓ కథను ఆయన సిద్ధం చేసినట్టు, దాదాపు అది ఓకే అయినట్టు చెబుతున్నారు.