Union Budget: కేంద్ర బడ్జెట్ మొబైల్ యాప్ ను ఆవిష్కరించిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman launched union budget mobile app
  • త్వరలో బడ్జెట్ సమావేశాలు
  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రకటన
  • పార్లమెంటులో హల్వా తయారీ కార్యక్రమం
  • సాధారణ ప్రజానీకానికి కూడా అందుబాటులోకి బడ్జెట్ ప్రతులు
మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం వార్షిక బడ్జెట్ కోసం మొబైల్ యాప్ తీసుకువస్తోంది. ఈ కేంద్ర బడ్జెట్ యాప్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఢిల్లీలో ఆవిష్కరించారు. బడ్జెట్ పత్రాలను పార్లమెంటు సభ్యులతో పాటు సాధారణ ప్రజానీకానికి కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పార్లమెంటులో సంప్రదాయంగా వస్తున్న హల్వా తయారీ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా యాప్ ను విడుదల చేశారు.

వార్షిక ఆర్థిక ప్రకటన, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లు సహా 14 బడ్జెట్ పత్రాలను ఈ యాప్ లో చూడొచ్చు. ఈ యాప్ వినియోగం ఎంతో సులువని, ఇందులో యూజర్లకు ఉపకరించేలా డౌన్ లోడ్, ప్రింట్, సెర్చ్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, బైడెరెక్షనల్ స్క్రోలింగ్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఎక్స్ టర్నల్ లింక్స్ ఫీచర్లున్నాయి. ఈ యాప్ ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ ఫాంలపై అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసిన వెంటనే బడ్జెట్ ప్రతులు ఈ యాప్ లో అందుబాటులోకి వస్తాయి.

ఈ యాప్ ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసింది. ఈ యాప్ ను కేంద్ర బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా, ఈసారి బడ్జెట్ పూర్తిగా డిజిటల్ మయం కానుంది. కరోనా నేపథ్యంలో బడ్జెట్ ప్రతులను కాగితంపై ముద్రించడంలేదు.
Union Budget
Mobile App
Nirmala Sitharaman
Parliament
India

More Telugu News