ఆధారాలు చూపించాలని దేవినేని ఉమకు నోటీసులిస్తాం: డీఎస్పీ సత్యానందం

20-01-2021 Wed 20:09
  • పేకాట దాడుల ఒత్తిళ్లతోనే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఉమ
  • దేవినేని ఉమ వ్యాఖ్యల్లో నిజం లేదన్న డీఎస్పీ
  • ఎస్ఐ ప్రియురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Will send notices to Devineni Uma says DSP Satyanandam

గుడివాడ టూటౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. ఈ హత్యపై దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలను డీఎస్పీ సత్యానందం తప్పుపట్టారు. విజయ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని, పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిళ్లకు తట్టుకోలేక మృతి చెందాడని దేవినేని ఉమ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను డీఎస్పీ తప్పుపట్టారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు చూపించాలని దేవినేని ఉమకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.

గుడివాడ టూటౌన్ ఎస్సైగా కొన్ని నెలల క్రితమే విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. గత సోమవారం అర్ధరాత్రి దాటాక తాను ఉంటున్న అపార్ట్ మెంటులో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాదే ఆయనకు పెళ్లి జరిగింది. మరోవైపు ఆయనకు సురేఖ అనే ప్రియురాలు ఉంది. ఆమెపై సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సురేఖనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు కారణమని ఆయన తమ్ముడు విక్రమ్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు.