Guntur District: టీడీపీ నేత అంకులు హత్యకేసులో ఆరుగురిని అరెస్ట్ చేశాం: గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్

Six persons arrested in TDP Leader Ankulu murder case
  • ఈ నెల 3న అంకులు దారుణ హత్య
  • నమ్మించి పిలిపించి గొంతుకోసిన దుండగులు
  • పాతకక్షలే కారణమన్న ఎస్పీ
గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ అంకులు హత్య కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన అంకులును ఈ నెల 3న దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పురోగతి సాధించారు. నేడు మీడియాతో మాట్లాడిన ఎస్పీ.. పాతకక్షలే అంకులు హత్యకు కారణమని తేల్చారు.

పెదగార్లపాడుకే చెందిన పురంశెట్టి అంకులు గతంలో నిషేధిత నక్సల్ సంస్థ జనశక్తిలో పనిచేశారు. అదే గ్రామానికి చెందిన చిన్నశంకరరావు, వెంకట కోటయ్య, వెంకటేశ్వరరెడ్డి కూడా గతంలో ఆయనతోపాటే పనిచేశారు. ఈ క్రమంలో అంకులుకు, వీరికి మధ్య విభేదాలు పొడసూపాయి. మరోవైపు, 30ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నా తనకు సరిగా జీతం ఇవ్వడం లేదని అంకులుపై చిన్న కోటేశ్వరరావు కోపం పెంచుకున్నాడు.

శత్రువులందరూ చేతులు కలిపి అంకులును హతమార్చేందుకు ప్లాన్ రచించారు. పథకంలో భాగంగా చిన్న శంకరరావు తన బంధువులైన అంకారావు, రమేశ్‌లను పిలిపించాడు. జనశక్తిలో పనిచేసి ఉండడంతో ఆ సంస్థకు సంబంధించి కొత్త నియామకాల గురించి మాట్లాడుకుందామని, వెంటనే గ్రామంలో ఉన్న తన అపార్ట్‌మెంట్ వద్దకు రావాలని అంకులుకు కబురుపెట్టారు. వెళ్లిన అంకులుకు తొలుత మత్తు పదార్థం కలిపిన ఆహారం తినిపించారు. ఆయన మగతలోకి జారుకున్న వెంటనే తువ్వాలుతో గొంతు బిగించి, కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యారని ఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్టు చెప్పారు.
Guntur District
Ankulu
TDP
Murder
Crime News

More Telugu News