పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో దిగుతున్నాం: శివసేన

18-01-2021 Mon 07:37
  • ఉద్ధవ్ థాకరేతో చర్చల అనంతరం ప్రకటించిన సంజయ్ రౌత్
  • దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తున్న శివసేన
  • ఇటీవల బీహార్ ఎన్నికల్లోనూ పోటీ
Shiv Sena Ready to Fight in West Bengal Elections

రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై శివసేన స్పష్టత నిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించింది. మహారాష్ట్ర వెలుపలకు క్రమంగా పార్టీని విస్తరిస్తున్న శివసేన తాజాగా బెంగాల్ బరిలోనూ దిగాలని నిర్ణయించింది. పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగాల్ ఎన్నికల్లో తాము పోటీ చేయబోతున్నామని ఆయన ట్వీట్ చేశారు.

గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివసేన పోటీ చేసింది. అయితే, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 22 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ ఓట్లను రాబట్టుకోవడంలో పార్టీ ఘోరంగా విఫలమైంది. శివసేనకు 0.05 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇవి ‘నోటా’కు వచ్చిన ఓట్ల కంటే తక్కువ కావడం గమనార్హం. నోటాకు 1.68 శాతం ఓట్లు పోలయ్యాయి.