COVID19: మిలటరీ కోసం కరోనా వైరస్​.. వుహాన్​ ల్యాబ్​ లో రహస్య ప్రయోగాలు!

  • నిజ నిర్ధారణ పత్రంలో అమెరికా ఆరోపణ
  • జనానికి సోకడానికి ముందే సైంటిస్టులకు అంటిందని వ్యాఖ్య
  • 2016లోనే ల్యాబ్ లో కరోనా శాంపిళ్లున్నాయని వెల్లడి
US releases fact sheet on Wuhan lab that deserves scrutiny

వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పుట్టిందని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఎన్నో దేశాలు వేలెత్తి చూపించాయి. అందులో అమెరికా కూడా ఒకటి. ఇప్పుడు దాని మూలాలు తేల్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) వుహాన్ లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఓ నిజ నిర్ధారణ పత్రాన్ని విడుదల చేసింది.

2016లోనే వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా వైరస్ పై పరిశోధనలు చేశారని ఆరోపించింది. మిలటరీకి జీవాయుధాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో అక్కడి శాస్త్రవేత్తలు కరోనాపై రహస్య పరిశోధనలు చేశారని పేర్కొంది. 2019లో ప్రపంచానికి కరోనా వైరస్ గురించి తెలియడానికి ముందే వుహాన్ ల్యాబ్ లోని సైంటిస్టులకు వైరస్ సోకిందని చెప్పింది. అయితే, ల్యాబ్ శాస్త్రవేత్తలెవరికీ వైరస్ సోకలేదని, వుహాన్ ల్యాబ్ సీనియర్ పరిశోధకురాలు షి ఝెంగ్లీ చెప్పడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొంది.

గతంలోనూ చైనాలోని ల్యాబుల్లో ప్రమాదవశాత్తూ వైరస్ లీకై జబ్బులకు కారణమైందని గుర్తు చేసింది. 2004లో బీజింగ్  ల్యాబ్ లో వైరస్ లీకవ్వడం వల్లే సార్స్ వచ్చిందని, ఆ ఘటనలో ఓ సైంటిస్ట్ చనిపోయారని, తొమ్మిది మంది దాని బారిన పడ్డారని పేర్కొంది. ఇప్పుడు వుహాన్ ల్యాబ్ లోనూ అదే జరిగిందని మండిపడింది. నిజాలను బయటపెట్టకుండా జర్నలిస్టులు, స్వతంత్ర దర్యాప్తుదారులను చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిరోధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్ లోని శాంపిళ్లను గతేడాది జనవరిలో పరిశీలించి ఆర్ఏటీజీ13గా తేల్చారని, 2016లోనే దానిపై వుహాన్ లో పరిశోధనలు మొదలయ్యాయని చెప్పింది. రెండింటి శాంపిళ్లను పోల్చి చూడగా 96.2 శాతం సరిపోలాయని వివరించింది. సార్స్ తర్వాత ఎలుకలు, గబ్బిలాలు, పాంగోలిన్స్ వంటి వాటిపై వుహాన్ ల్యాబ్ లో పరిశోధనలు జరిగాయని గుర్తు చేసింది. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు వుహాన్ ల్యాబ్ లో జరిగిన పరిశోధన తాలూకు పత్రాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేసింది.

More Telugu News