కశ్మీర్ యోధురాలి పాత్రలో కంగన రనౌత్!

15-01-2021 Fri 21:14
  • 'మణికర్ణిక'కు సీక్వెల్ గా 'ద లెజండ్ ఆఫ్ దిద్దా'
  • కశ్మీర్ మహారాణి దిద్దా పాత్రలో కంగనా
  • మహ్మద్ గజనీని రెండుసార్లు ఓడించిన దిద్దా  
Kangana all set to play Kashmir queen

ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కంగన రనౌత్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. పైగా ఫెరోషియస్ విమెన్ పాత్రలను తనదైన శైలి అభినయంతో పోషిస్తూ ఆమె పేరుతెచ్చుకుంది. ఈ కోవలో ఆమధ్య వచ్చిన 'మణికర్ణిక' చిత్రం అటువంటిదే. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిగా ఆ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అభినయం ఆ చిత్రాన్ని బాక్సాఫీసు విజయం వైపు నడిపించింది.

ఈ క్రమంలో ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నట్టు కంగన ఏ ఈరోజు ప్రకటించింది. ఈ చిత్రం పేరు 'మణికర్ణిక రిటర్న్స్: ద లెజండ్ ఆఫ్ దిద్దా'. ఈ చిత్రాన్ని 'మణికర్ణిక'ను మించిన బడ్జెట్టుతో.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. మణికర్ణికను నిర్మించిన నిర్మాత కమల్ జైన్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రం కశ్మీర్ మహారాణి, యోధురాలు దిద్దా కథగా తెరకెక్కుతోంది. మహ్మద్ గజనీని రెండుసార్లు యుద్ధంలో ఓడించిన ధీరవనిత దిద్దా. పైగా, ఒక కాలు పోలియో కారణంగా చచ్చుబడినప్పటికీ, యుద్ధంలో ఆమె చూపిన తెగువ.. పోరాటపటిమ  దిద్దాను మహా యోధురాలిగా చూపుతాయి. ఇప్పుడీ కథలో దిద్దా పాత్రలో కంగన నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.