Torchlight: కమలహాసన్ ఎంఎన్ఎం పార్టీకి మరోసారి టార్చిలైటు గుర్తు కేటాయించిన ఈసీ

EC allots Torchlight symbol for MNM party in Tamilnadu
  • తమిళనాట ఎంఎన్ఎం పార్టీ స్థాపించిన కమల్  
  • ఇదివరకే టార్చిలైటు గుర్తు కేటాయించిన ఈసీ
  • త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • మరోసారి అదే గుర్తు కేటాయిస్తూ ఈసీ ప్రకటన
  • ఈసీకి కమల్ కృతజ్ఞతలు
తమిళ రాజకీయాల్లో మార్పు తేవాలని, ప్రజల జీవితాలను మరింత మెరుగైన దిశగా మళ్లించాలని తపిస్తూ సినీ నటుడు కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఆ పార్టీకి  కేంద్ర ఎన్నికల సంఘం టార్చిలైటు గుర్తు కేటాయించింది.

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్ ఎంఎన్ఎం పార్టీకి ఈసీ మరోసారి అదే గుర్తు కేటాయించింది. ఈ విషయాన్ని ఎంఎన్ఎం పార్టీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తమకు మరోసారి టార్చిలైటు గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తున్నట్టు తెలిపింది.

దీనిపై కమల్ స్పందిస్తూ, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జన్మదినం రోజునే ఈ నిర్ణయం వెలువడడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. తమకు టార్చిలైటు గుర్తును కేటాయించినందుకు ఈసీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వెల్లడించారు. మనందరం కలిసి వెలుగును వ్యాపింప చేద్దామంటూ మిత్రపక్షాలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Torchlight
MNM
Kamal Haasan
EC
Tamilnadu

More Telugu News