Shoaib Akhtar: హమ్మయ్య... భారత్ మా రికార్డును బద్దలు కొట్టింది: పాక్ మాజీ పేసర్ అక్తర్

  • అడిలైడ్ టెస్టులో భారత్ దారుణ ఓటమి
  • రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకు కుప్పకూలిన టీమిండియా
  • గతంలో పాక్ 49 పరుగులకు ఆలౌట్
  • ఇప్పుడా రికార్డు తెరమరుగైందంటూ అక్తర్ సంతోషం
  • క్రికెట్ లో ఇలాంటివి సహజమేనంటూ వ్యాఖ్యలు
Shoaib Akhtar reacts to Teamindia terrible loss to Australia in Adelaide

భారత క్రికెట్ చరిత్రలో దారుణమనదగ్గ పరాజయం ఇవాళ ఆస్ట్రేలియా చేతిలో ఎదురైంది. అడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకే కుప్పకూలిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీనిపై పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ స్పందించాడు. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్థాన్ రికార్డును భారత్ బద్దలు కొట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

2013లో జోహాన్నెస్ బర్గ్ లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 49 పరుగులకే ఆలౌటైందని, ఇప్పుడు భారత్ 36 పరుగులకే చేతులెత్తేయడం ద్వారా తమ రికార్డు తెరమరుగైందని అక్తర్ అనందం వ్యక్తం చేశాడు. ఇవాళ టీమిండియా ఆటతీరు పరమచెత్తగా ఉందని పేర్కొన్నాడు. అయితే క్రికెట్ లో ఇలాంటివి సాధారణం అని స్పష్టం చేశాడు.

"ఉదయాన్నే నిద్రలేచి టీవీ ఆన్ చేశాను. భారత్ స్కోరు మసక మసగ్గా 369 అన్నట్టుగా కనిపించింది. కళ్లు నులుముకుని సరిగా చూస్తే 36/9 అని అర్థమైంది. ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఇలా కుప్పకూలిపోయింది. ఇది నిజంగా దుర్వార్తే! ఇలాంటి ఓటమితో వచ్చే విమర్శలను తట్టుకోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి" అని అక్తర్ వివరించాడు.

More Telugu News