Archana Barua: ఇది ఓ ఆర్కెస్ట్రా గాయని నేర చరిత్ర!

Archestra singer turns thief
  • భర్తతో కొన్నేళ్ల కిందట హైదరాబాదులో నివసించిన నిక్కీ
  • ఆర్కెస్ట్రాలో పాటలు పాడిన నిక్కీ
  • భర్తకు వ్యాపారంలో నష్టాలు
  • భర్తతో కలిసి స్వస్థలం కోల్ కతాకు పరార్
  • విడాకుల తర్వాత చోరీల బాటపట్టిన నిక్కీ

పశ్చిమ బెంగాల్ కు చెందిన మున్ మున్ సేన్ అలియాస్ అర్చనా బారువా అలియాస్ నిక్కీ నేర చరిత్ర తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోయారు. వరుసగా దొంగతనాలు చేస్తున్న ఆమె గతంలో ఓ ఆర్కెస్ట్రాలో గాయని అంటే ఎవరికైనా విస్మయం కలగకమానదు. ఇంతకీ నిక్కీ కథలోకి వెళితే... ఆమె కొన్నేళ్ల కిందటివరకు భర్తతో కలిసి హైదరాబాదులోనే ఉండేది. భర్త వ్యాపారం చేస్తుండగా, నిక్కీ ఓ ఆర్కెస్ట్రాలో పాటలు పాడేది. అయితే, ఆమె భర్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోవడంతో వారి కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.

అప్పులు పెరిగిపోయాయి. దాంతో నిక్కీ కుటుంబం కోల్ కతాకు పారిపోయింది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో భర్తతో విడాకులు తీసుకున్న నిక్కీ అప్పటికే విలాసాలకు అలవాటు పడింది. అయితే ఉపాధి కోసం ఎక్కడ ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చోరీల బాటపట్టింది. ఒకచోట కాదు.. అనేక నగరాల్లో ఖరీదైన షాపింగ్ మాల్స్, బ్యూటీ పార్లర్లు, రద్దీగా ఉండే మార్కెట్లలో దొంగతనాలు చేసింది. ఎక్కువగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్ కతా నగరాల్లో ఖరీదైన వస్తువుల చోరీకి పాల్పడింది.

గతేడాది ముంబయిలోని లోయర్ పారెల్ ప్రాంతంలో ఓ మహిళ బ్యాగ్ ను దొంగిలించింది. ఆ బ్యాగ్ లో రూ.50 వేల నగదు, రూ.13 లక్షల విలువైన బంగారు నగలు, ఖరీదైన ఐఫోన్ ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత మంగళవారం నిక్కీని అదుపులోకి తీసుకున్నారు. అనేక ప్రధాన నగరాల పోలీసులు ఆమె కోసం వెదుకుతున్నారు.

నిక్కీ అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి కాదు. తాజా అరెస్ట్ తో కలిపి 11 సార్లు పోలీసులకు పట్టుబడింది. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. కొన్నేళ్ల కిందట ఆమె తన మకాం బెంగళూరుకు మార్చింది.

  • Loading...

More Telugu News