Errabelli: కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ము నీకు ఉందా?: బండి సంజయ్ పై ఎర్రబెల్లి ఫైర్

Do you have the guts to put KCR in jail asks Errabelli to Bandi Sanjay
  • బండి సంజయ్ కొత్తగా వచ్చిన బిచ్చగాడిలాంటి వాడు
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చావో చెప్పు
  • కేసీఆర్ మీలాంటి అల్లాటప్పా నాయకుడు కాదు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన వెంటనే... దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఆ పార్టీ సత్తా చాటింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను బండి సంజయ్ స్థాయిలో మరే ఇతర నేత కూడా సవాల్ చేసుండకపోవచ్చు. ప్రతి రోజు ముఖ్యమంత్రిపై ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నాలుగు సార్లు ఓడిపోయారనే జాలితోనే కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ ను గెలిపించారని ఎర్రబెల్లి అన్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన బిచ్చగాడిలాంటి వాడని ఎద్దేవా చేశారు. ఆయనకు ఇదే తొలి పదవి, చివరి పదవి అని జోస్యం చెప్పారు. కేసీఆర్ జైలుకు పోక తప్పదంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ... కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ము నీకుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కొడితే మానేరు డ్యామ్ లో పడతావని అన్నారు. రాష్ట్రానికి నీవేం చేశావో, కేంద్రం నుంచి ఏం తెచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే కరీంనగర్ ప్రజలే పరిగెత్తించి కొడతారని అన్నారు. దమ్ముంటే కేంద్రం నుంచి నీటి వాటాను తీసుకురావాలని సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో సంజయ్ మత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

భాగ్యలక్షి ఆలయాన్ని అడ్డు పెట్టుకొని మత కలహాలను సృష్టించేందుకు బండి సంజయ్ యత్నిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. కరోనా వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికలను ముందుగానే నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. మతతత్వ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం వంటి కారణాల వల్లే దేశంలో బీజేపీ గెలిచిందని అన్నారు. బండి సంజయ్ ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని చెప్పారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడని, మీలాంటి అల్లాటప్పా నాయకుడు కాదని అన్నారు. కేటీఆర్, కవిత కూడా ఉద్యమాల నుంచే వచ్చారని చెప్పారు. ఒక వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ల సమస్య తీరుతుందని తెలిపారు.
Errabelli
KCR
KTR
K Kavitha
TRS
Bandi Sanjay
BJP

More Telugu News