Arvind Kejriwal: బంద్ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు: ఆప్ ఆరోపణలు

  • నిన్న సాయంత్రం నుంచి ఆయన నివాసంలోకి ఎవరికీ అనుమతి లేదన్న ఆప్
  • భారీగా పోలీసులు మోహరించారని ఆరోపణ
  • ఆప్ ఆరోపణలను ఖండించిన పోలీసులు
kejriwal under house arrest

భారత్ బంద్ కు తమ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా మద్దతిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీ సరిహద్దులకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అయితే, బయటకు రాకుండా పోలీసులు ఆయనను గృహనిర్బంధంలో ఉంచినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ చెబుతోంది. అలాగే, నిన్న సాయంత్రం నుంచి ఆయన నివాసంలోకి ఎవరినీ అనుమతించడం లేదని ఆరోపించింది.

సింఘు ప్రాంతంలో నిన్న కేజ్రీవాల్ రైతుల్ని పరామర్శించి సంఘీభావం తెలిపినప్పటి నుంచి ఆయన నివాసం వద్ద భారీస్థాయిలో బలగాల్ని మోహరించినట్లు పేర్కొంది. నిన్న సాయంత్రం ఓ సమావేశంలో పాల్గొనేందుకు ఆయనను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలపై కూడా పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని ఆరోపించింది. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోన్న ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. కేజ్రీవాల్‌ గృహనిర్బంధంలో లేరని, భారత్ బంద్‌ నేపథ్యంలో ఆప్‌ కార్యకర్తలకు, ఇతర పార్టీలకు మధ్య ఘర్షణలు జరగకుండానే ముందు జాగ్రత్తగా బలగాల్ని మోహరించామని తెలిపింది.

More Telugu News