Hari Shukla: ఈరోజు నుంచి బ్రిటన్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. భారత సంతతి వ్యక్తికే మొదటి టీకా డోసు!

Indian origin Hari Shukla first to get coronavirus vaccine in UK
  • కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసిన బ్రిటన్
  • 87 ఏళ్ల హరి శుక్లాకు తొలి టీకా డోసు
  • టీకా డోసు తీసుకోవడం తన బాధ్యత అన్న శుక్లా
కోవిడ్ టీకాను దేశ ప్రజలకు ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈరోజు నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తొలి వ్యాక్సిన్ వేయించుకోబోతున్న వ్యక్తిగా భారత సంతతికి చెందిన 87 ఏళ్ల హరి శుక్లా రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. ఆయన బ్రిటన్ లోని టైన్ అండ్ వేర్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. స్థానిక న్యూ క్యాజిల్ ఆసుపత్రిలో ఆయన టీకా తీసుకోనున్నారు.

ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ, టీకా తీసుకోవడం తన బాధ్యత అని చెప్పారు. ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా మహమ్మారికి ముగింపు పలికే దశకు మనం చేరుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వ్యాక్సిన్ తీసుకుని తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని చెప్పారు. తొలి వ్యాక్సిన్ తీసుకోనుండటం తనకు సంతోషంగా ఉందని అన్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అందరినీ సురక్షితంగా ఉంచేందుకు కృషి చేసిన నేషనల్ హెల్త్ సర్వీస్ వారికి ధన్యవాదాలు చెపుతున్నానని తెలిపారు.  

మరోవైపు, ఈ టీకాను అందిస్తున్న ఈరోజును 'వీ-డే' (టీకా దినోత్సవం)గా పిలుస్తున్నారు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం స్పందిస్తూ, చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమంగా అభివర్ణించింది. తొలి విడతలో ఆరోగ్య సిబ్బంది, కేర్ హోం వర్కర్లు, 80 ఏళ్లకు పైబడిన వృద్ధులకు టీకా అందిస్తున్నారు. తొలి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. ఈ టీకాను బ్రిటన్ ప్రభుత్వంతో కలిసి ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ ఉత్పత్తి చేసింది.
Hari Shukla
UK
Covid Dose

More Telugu News