2008 నాటి ఆర్థిక సంక్షోభం కంటే.. కరోనా సంక్షోభమే అధికం: అధ్యయనం

04-12-2020 Fri 07:11
  • కొవిడ్ ప్రభావంపై హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్, ఇన్ఫోసిస్ సంయుక్త సర్వే
  • కరోనా ప్రభావం తమపై తీవ్రంగా ఉందన్న 70 శాతం సంస్థలు
  • పని విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న 90 శాతం సంస్థలు
Covid effect is higher than 2008 financial crisis

కొవిడ్ కారణంగా వివిధ రంగాలు ఎంతగా దెబ్బతిన్నాయో తెలుసుకునేందుకు హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్, ఇన్ఫోసిస్ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. ‘నో వేర్ టు హైడ్: ఎంబ్రాసింగ్ ది మోస్ట్ సీస్మిక్ టెక్నలాజికల్ అండ్ బిజినెస్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్‌టైమ్’ పేరుతో నిర్వహించిన అధ్యయన వివరాలను సంస్థలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా పలు సంస్థలు కొవిడ్ కాలంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించాయి. 2008 నాటి ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే కొవిడ్ ప్రభావమే తమపై అధికంగా ఉందని 70 శాతం సంస్థలు పేర్కొన్నాయి. అలాగే, బడ్జెట్లు, సరఫరా వ్యవస్థలు, ఉద్యోగుల లభ్యత, ఖాతాదార్ల సాన్నిహిత్యం వంటి పలు అంశాలపై కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని అధ్యయనం తేల్చింది.

హైబ్రిడ్ వర్క్‌ఫోర్స్‌తో ముందుకెళ్లవచ్చని 51 శాతం సంస్థలు పేర్కొన్నాయి. కొవిడ్ కారణంగా యాంత్రీకరణ, డిజిటల్ వ్యాపార నమూనాలకు మారడండతో ఖాతాదారుల అవసరాలకు తగ్గట్టుగా త్వరగా స్పందించేందుకు ఆయా సంస్థలు హైపర్-స్కేల్ క్లౌడ్‌ను ఉపయోగించుకున్నాయి.

కార్పొరేట్ మనస్తత్వాలు మారేందుకు కరోనా దోహదం చేసింది. భిన్నమైన ఖాతాదారుల సమూహాలను నిర్మించడం ద్వారా తమ వ్యాపారాలను అస్థిరత నుంచి మెరుగైన స్థితికి చేరుస్తామని 65 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పని విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని 90 శాతం సంస్థలు చెప్పడం గమనార్హం. అయితే, 37 సంస్థలు మాత్రం కొవిడ్ తర్వాత కూడా కార్యాలయ వాతావరణాన్ని ఇంకా కొనసాగిస్తామని చెప్పాయి.