AIIMS: ఈ నెలాఖరు నాటికి కరోనా వ్యాక్సిన్: ఎయిమ్స్

  • పంపిణీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సన్నాహాలు
  • పెద్ద ఎత్తున పరీక్షలు జరుగుతున్నప్పుడు అపశ్రుతులు సహజమే
  • టీకాను సుదీర్ఘకాలం తీసుకుంటే సమస్యలు తప్పవు
  • ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా
Corona vaccine may come in last week of december

కరోనా టీకాపై ఎయిమ్స్ శుభవార్త చెప్పింది. టీకా పరీక్షలు దాదాపు తుది దశకు చేరుకోవడంతో ఈ నెలాఖరు, లేదంటే వచ్చే నెల ప్రారంభంలో టీకా అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు.

 అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన వెంటనే పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని భద్రపరిచేందుకు అవసరమైన ఉష్ణోగ్రతలు, స్థలం, వ్యాక్సిన్ ఇచ్చే వారికి శిక్షణ, సిరంజిల లభ్యత వంటి వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించినట్టు చెప్పారు.

టీకాకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నప్పుడు అపశ్రుతులు సహజమేనని డాక్టర్ గులేరియా అన్నారు. చెన్నైలో వ్యాక్సిన్ పరీక్షలో పాల్గొన్న ఓ వలంటీర్ అనారోగ్యానికి గురైనట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అతడికి వేరే కారణాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ఉండొచ్చని, టీకా వల్ల అయి ఉండదని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది వలంటీర్లకు టీకా ఇచ్చినా ఎవరిలోనూ ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదన్నారు.

అయితే, ఏదైనా వ్యాక్సిన్‌ను సుదీర్ఘకాలంపాటు తీసుకుంటే మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పిన డాక్టర్ గులేరియా.. మరో మూడు నెలల్లో పెద్ద మార్పు కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News