నేడు కూడా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు!

03-12-2020 Thu 10:31
  • ఇటీవలి కాలంలో రోజూ వడ్డన
  • 13 రోజుల వ్యవధిలో 11 సార్లు పెంపు
  • ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధర
Petrol Price Hike Today

ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరలు గురువారం కూడా పెరిగాయి. లీటరు పెట్రోలుపై 17 పైసలు, డీజిల్ పై 19 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. దీంతో నవంబర్ 20 నుంచి 13 రోజుల వ్యవధిలో 11 సార్లు ధరలు పెరిగినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతూ వస్తున్నందునే ఇండియాలోనూ ధరలు పెంచాల్సి వస్తోందని చమురు సంస్థలు అంటున్నాయి.

కాగా, తాజా పెంపుదల తరువాత ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ. 82.66కు చేరగా, డీజిల్ ధర రూ. 72.84కు పెరిగింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో నిన్న క్రూడాయిల్ ధర బ్యారల్ కు 2 శాతం పెరిగింది. ఇక నేడు ఈ ధర మరింతగా పెరిగి నైమెక్స్ చమురు బ్యారల్ ధర 45.30 డాలర్లకు చేరగా, లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 49.30 డాలర్లకు చేరింది. మార్చి తరువాత క్రూడాయిల్ ధరలు ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.